Thursday 21 February 2013

అంకెలు కాదు వ్యక్తులు, జీవితాలు మరియు కుటుంబాలు


22 మరియు 70  లేదా
20 మరియు 22  లేదా
13 మరియు 84 లేదా
14 మరియు 78.

         21 February 2013 రోజు సాయంత్రం వరకు ఇవి వట్టి అంకెలు మాత్రమే. ఏడు గంటల సమయంలో  హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబుల పేలుళ్ళ తరువాత ఆ అంకెలు వ్యక్తులు, జీవితాలు మరియు కుటుంబాలు అయ్యాయి. అవును ఈ అంకెలు వివిధ మీడియా ల లో రిపోర్ట్ చేసిన,
ఆ విషాద సంఘటన లో మరణించిన మరియు గాయపడిన వారి సంఖ్య.

ఎవరు చేసారు? ఎందుకు చేసారు?
ఇంటలిజెన్స్ వైఫల్యమా? పోలీసుల అలసత్వమా? నాయకుల అసమర్థతా?
ఇంక భవిష్యత్తు లో ఇలాంటివి జరగకుండా ఏమి చెయ్యాలి?
దానికి ఎవరెవరు ఏమి చెయ్యాలి?

ఇది  ప్రశ్నలు వేసుకోవడానికి గాని,  విశ్లేషణ లు చెయ్యడానికి గాని సమయం కాదు.
ఇది బాధితులను గురించి ఆలోచించే సమయం. వారి కుటుంబాల గురించి ఆలోచించే సమయం.
అక్కడ బాధితులు  కేవలం వ్యక్తులు కాదు. వాళ్ళు  
కూతుర్లు , కొడుకులు.
భార్యలు, భర్తలు.
తల్లులు, తండ్రులు.
స్నేహితులు.
ఇలాంటి ఇంకెన్నో, బంధాలు, అనుబంధాలు వాళ్ళు . వాటి చుట్టూ అల్లుకున్న కుటుంబాలు.
ఆ బంధాలు తెగిపోయాయి.
వాళ్ళు చెరిగి పోయిన కలలు. ఆశలు, భవిష్యత్తులు.
ఇది, చనిపోయిన కుటుంబాల వాళ్ళు , గాయపడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు-  
వాళ్ళు కొలిచే దేవుడి మీద నమ్మకం ద్వారా  గాని,
మానవత్వం మీద నమ్మకం ద్వారా గాని,
బతకాలనే తీవ్రమైన ఆకాంక్ష ద్వారా గాని -
ఈ విషాదాన్ని భరించగలిగే శక్తి ని పొందాలి అని కోరుకుంటూ, ఆశిస్తూ మనం వారి కోసం
ప్రార్థన చేసే సమయం. 

Monday 20 August 2012

ఫీజు రియెంబర్సుమెంట్ పథకం తో ఎవరికి మేలు?

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు వృతి విద్యా కోర్సు లకు అమలు అవుతున్న ఫీజు రియెంబర్సుమెంట్ పథకం విషయం లో ఎలా వ్యవహరించాలో తెలియడం లేదు. ఈ పథకం కోసం -వివిధ పత్రికలలో వస్తున్న సమాచారం ప్రకారం- ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరం లో 3000 కోట్ల రూపాయల వరకు భరించింది. ఇందులో సగానికి పైగా (సుమారు 1772 కోట్ల రూపాయలు) ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తి కోర్సు ల కోసం చెల్లించింది. కాలేజీ ల సంఖ్య ప్రకారం చూస్తే, ఇందులో ఇంజనీరింగ్ దే సింహభాగం అయి ఉటుంది అనడం లో సందేహం లేదు. ఇంజనీరింగ్ ఫీజులు పెరుగబోతున్న నేపధ్యం లో- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏకీకృత ఫీజు మరియు ఇంజనీరింగ్ కాలేజి లు అధ్యాపకులకు ఇస్తున్న వేతనం ఆధారం గా ఫీజు లు వసూలు చేసే అవకాశం వలన - ఈ పథకం ప్రభుత్వానికి పెనుభారం గా పరిణమించబోతోంది అంటున్నారు. (ఈ ఆర్థిక సంవత్సరం లో 3500 నుంచి 4000 వరకు పెరిగి , తరువాత  ప్రతి సంవత్సరం కొంత శాతం పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు) . వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం వార్షిక బడ్జెట్ లో నాలుగు శాతం లోపు ఖర్చు ప్రభుత్వానికి నిజంగా పెనుభారమా?

ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలలో అధికార పార్టీ ల రాజకీయ ప్రయోజనాలు కలిసి ఉండడం సాధారణమైన విషయమే అయినా, ఫీజు రియెంబర్సుమెంట్ పథకం ఓట్ల కోసమే కాకుండా సంక్షేమం ముసుగులో ప్రజల సొమ్మును తమకు నచ్చిన వారికి పంచి పెట్టడానికి కూడా ఉద్దేశించిన పథకం. (రాజకీయ పార్టీలు వాటి సిద్దాంతాలను అమలు పరచడానికి అధికారం సంపాదించడం అనేది రాజకీయ ప్రయోజనం గా ఉండడం నుంచి, ప్రభుత్వాధినేతలు- పార్టీ  నేతలకు, వారి అనుచరులకు- ప్రజల సొమ్ము దోచి పెట్టడంమే రాజకీయ ప్రయోజనానికి ప్రస్తుత అర్థం అవ్వడం వేరే విషయం). భారతదేశంలో మరియు విదేశాలలో సాఫ్ట్ వేర్ జాబ్ అవకాశాలు పెరిగిన తరువాత ఇంజనీరింగ్ చదువు కు క్రేజ్ పెరగడం, స్వదేశం లోనో లేదా విదేశం లోనో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలతో పెళ్ళి అవడానికి అమ్మాయిలకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండడం ముఖ్యమైన అర్హత అవడం మొదలైన తరువాత,  దానిని సొమ్ము చేసుకొవడానికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజిలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ఇలా కొత్తగా ప్రారంభం అయిన  ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజిల లో చాల వరకు రాజకీయ నాయకులకు చెందినవి లేదా వారికి సన్నిహితంగా ఉన్నవారివే. అవసరానికి మించి ఇంజనీరింగ్ సీట్లు అందుబాటు లోకి రావడం, ఈ కొత్త కాలేజీ లలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడం తో, సహజం గానే ఈ కాలేజీ లలో సీట్లు భర్తీ అవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసం గా 240 సీట్లు (నాలుగు కోర్సు లకు కలిపి) ఉండే ఇలాంటి కాలేజీ లలో ఒక విద్యా సంవత్సరం లో 10 సీట్లు కుడా భర్తీ అవ్వక, చిన్న పట్టాణాల దగ్గర ఉన్న చాలా కాలేజీ లు మూసివేయడం కుడా జరిగింది.  ఇదే సమయం లో 2009 అసెంబ్లీ ఎన్నికలు కోసం తెరపైకి వచ్చిన ఫీజు రియెంబర్సుమెంట్ పథకం తో మూయడానికి సిద్దంగా ఉన్న ఇలాంటి కాలేజీ లకు- నాణ్యత మెరుగు పరచుకోకుండానే - survive అయ్యే అవకాశం కలిగింది.
అదే సమయం లో, ఫీజు రియెంబర్సుమెంట్ పథకం ద్వారా లక్షల మంది వెనుకబడిన (BC) మరియు ఆర్థికంగా వెనుకబడిన (EBC) కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య  లక్ష్యాన్ని అందుకోగలుగుతున్నారు అని చెప్పడం కుడా సత్యదూరం కాదు. ఒక విద్యార్థి లేదా విధ్యార్థిని చదువుకోవడం అనేది వారి కుటుంబ ఆర్థిక స్థితి మీద కాకుండా ప్రతిభ, ఆసక్తి ల మీద ఆధారపడిఉండే పరిస్థితి ఉండాలి అనేది అందరు అంగీకరించే విషయం. ఈ లక్ష్యాన్ని- ఉన్నత విద్య విషయం లోనే అయినా- కొంతవరకు సాధించడానికి ఈ పథకం ఉపయోగ పడుతోంది. అదే సమయం లో కాలేజి చదువు అనేది- ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా చదువు- విద్యార్థులను ఉద్యోగానికి అర్హులుగా మార్చి, తద్వారా సంపాదనాపరులుగా  మారేందుకు ఉపకరించేది. వృత్తి విద్య, పీజీ లాంటివి పూర్తి చేసిన 5-6 యేండ్ల కాలం లో చాల మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. ఇంజనీరింగు పూర్తి చేసిన వాళ్ళు ఇంకా తక్కువ సమయం లో కుడా ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు. కొంతమంది విషయం లో ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతున్నప్పటికీ పెరిగిన ప్రైవేటు ఉద్యోగ అవకాశాల నేపధ్యం లో మెజారిటి విద్యార్థులు ఈ సమయం లోనే సంపాదన పరులు గా మారగలుగుతున్నారు.  At least ఇంజనీరింగ్ సీట్లు తక్కువ గా ఉండి, ఇంజనీరింగ్ ప్రవేశం కోసం అంతో ఇంతో ప్రతిభ అవసరం అయిన ఉండిన సమయం లో అయినా ఇలాంటి పరిస్థితి ఉండేది .ఇప్పుడు నిజంగా ఇలా జరుగుతోందా? ఇప్పుడు ప్రతి ఏటా పాస్ అవుతున్న ఇంజనీరింగ్  గ్రాడ్యుయేట్ల లో 15 శాతం మంది కుడా ఉద్యోగానికి అర్హులు అయిన వారు ఉండడం లేదు అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? విద్యార్ధి ని ఉద్యోగానికి అర్హుడైన వ్యక్తి గా తయారు చేసే ఇంజనీరింగ్ చదువును, ప్రతిభ, ఆసక్తి రెండింటి లో ఏదో ఒకటైనా లేని విద్యార్థులకు, ప్రజల డబ్బుతో ఉచితంగా చదివే అవకాశం ఇవ్వడం దీనికి కారణమా? ఇలా ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇలా ఎంత కాలం ఇవ్వగలరు? సహజంగానే ఇది కాలేజీ లలో నాణ్యత లేమికీ, విద్యార్థులలో బాధ్యతారాహిత్యానికీ దారి తీయదా? బాధ్యత లేని విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడు అవుతాడా? విద్యార్థుల ఉన్నత చదువు అవకాశం , రాజకీయ పార్టీ ల, నాయకుల దయాదాక్షిణ్యాలపై  ఎందుకు ఆధారపడి ఉండాలి? విద్యార్థి కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఉన్నత చదువు కు అడ్దంకి అవ్వకూడదు. అదే సమయం లో ఉన్నత విద్య చదవడం అనేది ఒక బాధ్యతాయుతమైన విషయం అవ్వాలి. యే విధమైన ఉన్నత విద్య చదవాలి, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి  అనే విషయం విద్యార్ధి ప్రతిభ మరియు ఆసక్తి మీద మాత్రమే ఆధారపడి ఉండాలి.

మరి ఫీజు రియెంబర్సుమెంట్ కు ప్రత్యామ్నాయం ఏమి లేదా? రాజకీయాలతో సంబంధం లేకుడా దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించడం సాధ్యమే. ప్రభుత్వ ఆధ్వర్యం లో పని చేస్తూ  కార్యనిర్వాహక స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక  సంస్థను నెలకొల్పి, దాని ద్వారా డిగ్రీ కోర్సు లలో చేరే ప్రతి స్టూడెంట్ కు వారి ఆర్ధిక, సామాజిక స్థితి తో సంబధం లేకుండా Education loan ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇది చదువు పూర్తి అయిన తరువాత 5-10 సంవత్సరాల  గడువు లో తీర్చేసేలా ఉండాలి. వెనుకబడిన తరగతుల మరియు ఆర్థికం గా వెనుకబడిన వారికి నాణ్యమైన ప్రాధమిక విద్య అంది ఉండదు అనే కారణం తో ఈ Education loan, వారికి  వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వాలి. మిగతా వారికి చదువు అయిపోయిన 5-10 సంవత్సరాలలో తక్కువ వడ్డీ తో వంతుల వారి గా (EMI) చెల్లించే అవకాశం ఇవ్వాలి. కులం, ఆర్ధిక పరిస్థితి సంబంధం లేకుండా ఇలా అందరికి ఇలా Education loan ఇవ్వడం మొదలు పెడితే , కొన్ని సంవత్సరాలు గడిచే సమయానికి ఇలా loans ఇవ్వడానికి తగిన మొత్తం ను సంస్థ  కలిగిఉండడమే కాకుండా వచ్చే ఆదాయం తో నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం మీద ఆధార పడవలసిన అవసరం ఉండదు. కాలేజీ ఫీజులు పెరిగినప్పుడు ప్రభుత్వం కొంత అదనపు మూలధనం ను అందించడం ద్వారా  అందరికి ఉన్నత విద్య అనే లక్ష్యం ను సాధించడం సులభం అవుతుంది.  ప్రతిభ లేదా ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ లో చేరడం, సౌకర్యాలు, నాణ్యత ను బట్టి ఫీజు ను నిర్ణయించు కొనే అవకాశం కాలేజి లకు ఉండడం తో  కాలేజీ ల మద్య పోటి వాతావరణం పెరిగి రాష్ట్రం లో క్వాలిటీ ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చి విద్యార్థులకు మేలు జరుగుతుంది. అర్హులైన విద్యార్థుల కంటే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువ ఉండే పరిస్థితి ఉండదు.  అయితే loan తీసుకున్న విద్యార్థులంతా కోర్సు పూర్తి చేస్తారా? మధ్యలో  మానేసే వాళ్ళ మాట ఏమిటి? మరి ఆ డబ్బు ఎలా తిరిగి వస్తుంది? యే విధమైన guarantee  లు లేకుండా ఇచ్చే loan లను ఎంత వరకు తిరిగి వసూలు చెయ్యగలరు అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. సరి అయిన విధానాలు రూపొందించడం ద్వారా వీటిని అరికట్టడం కష్టం కాబోదు.  ప్రతి ఏటా ఎంత పెరుగుతుందో తెలియని మొత్తాన్ని భరించడం కంటే, ఇలాంటి నష్టాలను భరించడం ప్రభుత్వానికి సులభమే.

అందరికి చదువు అనే సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి అని చెప్పడం దీని ఉద్దేశం కాదు. విద్యార్థి ఉన్నత చదువు కు పునాది లాంటి ప్రాధమిక విద్య కు ఫీజు రియెంబర్సుమెంట్ పథకం ఎందుకు అమలు చెయ్యకూడదు? ప్రాధమిక విద్యకు ఫీజు రియెంబర్సుమెంట్ పథకం అమలు చేస్తే అందరికి విద్యాహక్కు లక్ష్యంను సాధించడానికి ఉపకరిస్తుంది. ప్రాధమిక విద్య కు ఫీజు రియెంబర్సుమెంట్ పథకం లాంటిది అమలు చెయ్యకపోవడానికి కారణాలు ఉహించడం కష్టం కాదు.  చాల ప్రైవేటు స్కూల్స్ రాజకీయ నాయకులకు సంబంధించినవి కాకపోవడం, ఆ వయసు పిల్లల కు ఓటు హక్కు లేకపోవడమే ఆ కారణాలు కాదా? ఏదైనా ఉచితం అనే పథకాలతో వచ్చే పొలిటికల్ మైలేజి, శాశ్వత పరిష్కారం సాధించే పథకాలకు ఉండదు. సమస్యలను సజీవంగా ఉంచడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవాలి అని ఆలోచించే నాయకులు ఆ దిశ లో ఆలోచన చేస్తారా? ఇలాంటి శాశ్వత పరిష్కారం కోసం సమాజం నుండి ఒత్తిడి వస్తే చెయ్యకుండా ఉండడం సాధ్యం అవుతుందా?

Monday 6 August 2012

ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం మనకు అంత ముఖ్యమైన విషయమా?

కిందటి వారం, ఒలింపిక్స్ లో  చైనా వాళ్ళు చాల పతకాలు సాధించడం ఇలా సాధ్యం అయ్యింది అని, కొంతమంది చిన్న పిల్లలను చాల హింసాత్మకంగా వ్యాయామం చేయిస్తున్న ఫోటో లను ఇమెయిల్ లో  పంపిచారు. దాదాపు అదే సమయం లోనే, అదే ఫోటో లు ఉండి ఇలాంటి పతకాలు అవసరమా? అనే అర్థం వచ్చేలా రాసిన ఒక బ్లాగ్ కుడా చదివాను. ఫోటో లు ఇంతకు ముందు చూసిన వాటిలాగ ఉన్నాయే అనుకొని ఆలోచిస్తే, నాలుగు సంవత్సరాల కిందట బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు (అయిపోయిన తరువాత నో),  మన వాళ్లు ఎందుకు పతకాలు సాధించలేక పోతున్నారు అని రాస్తూ, ఇవే ఫోటో లు ఉన్న ఈమెయిలు చదివినట్లు జ్ఞాపకం వచ్చింది.
ప్రతి నాలుగు సంవత్సరాల లకు ఒకసారి ఒలింపిక్స్ జరగడం, అవి మొదలై మిగతా దేశాల క్రీడాకారులు పతకాలు సాధించడం, ఎవరెవరు ఎన్ని గెలిచారో మనం టీవీ లలో చూడడం లేదా వాటి గురించి పత్రికలలో చదవడం జరుగుతోంది. అ వెంటనే చైనా తోనో లేదా బాగా తక్కువ జనాభా ఉన్న ఏదో ఒక యూరోపియన్ దేశం తోనో పోలికలతో, ఎందుకు భారతదేశ క్రీడాకారులు పతకాలు గెలవడం లేదు అనే ఆవేదన తో కూడిన విశ్లేషణలు మరియు విమర్శలు  మొదలవుతాయి. ఒలింపిక్స్ అయిపోయిన తరువాత రోజు నుండి నాలుగు సంవత్సరాలు గడిచి మరల ఒలింపిక్స్ వచ్చే వరకు పతకాల గురించి చర్చలు కనిపించవు. ఆలోచనలు రావు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం మనకు అంత ముఖ్యమైన విషయమా? అసలు మనం ఏదయినా అనుకుంటే సాధించకుండా వదులుతామా? ఇదేదో అందని ద్రాక్ష పళ్ళ వ్యవహారం లా ఉందే అనుకోవాల్సిన పని లేదు. IIT/IIM  లేదా MIT/ Harvard/Oxford యూనివర్సిటీ ల లోనో  సీట్ సాధించడం లేదా ఒలింపిక్స్ లో పతకం సాధించడం, వీటి మధ్య చాల తేడానే ఉండి విబిన్నమైన కృషి అవసరం అయినప్పటికీ ,  ఇవి సాధించడానికి అవసరమైన స్పూర్తి (Motivation కు సమాన పదం అనుకుంటున్నాను), పట్టుదల ఇంకా నిరంతర కృషి అనే విషయాలలో లో  చాల సామరస్యాలు కుడా ఉన్నాయి.
దేశం లోని చాల సమస్యల లాగానే పతకాల సమస్య కు కుడా అవినీతి యే- క్రీడా సంస్థల లో మరియు వాటిని నియంత్రించే రాజకీయ నాయకులలో- కారణం అని చాల మంది నమ్మకం. వైఫల్యానికి వీటి  పాత్ర కుడా కొంత వరకు ఉన్నప్పటికీ ఇవి మాత్రమే కారణం కాదు. మన దేశం లో, మంచి కాలేజీ లో సీట్ సంపాదించి ఆ తరువాత విదేశాలలో చదవాలి అనో, స్వదేశం లోనో విదేశాల లోనో  సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలనే కోరిక నే ఎక్కువ మందికి -విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు-  ఉంది కాబట్టే ఆ దిశలో మన ప్రయత్నాలు ఉన్నాయి. వట్టి ప్రయత్నాలు మాత్రమే కాకుండా మంచి ఫలితాలు కుడా సాధిస్తున్నాము.  ప్రభుత్వ వైఫల్యాలు లేదా వ్యవస్థ లో ఉన్న అవినీతి వీటిని అంతగా ప్రభావితం చేయలేకున్నాయి. (అందరికి కోరిన చదువు చదువుకొనే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కనీస వసతులు కుడా అందుకోలేని పేదవారు చాలామంది ఉన్నారు మన దేశం లో. ఇది చదువు ను భరించగలిగే స్థోమత ఉన్న వారి గురించే).
ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచో ఊడి పడరు కదా? ఆటలలో ఆసక్తి ఉన్న పిల్లలు వాటిని నిరంతరం సాధన చేసి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు గా రూపొందుతారు . ప్రభుత్వ  పాఠశాల లలో ఇంకా కొంత వరకు క్రీడలకు సమయం కేటాయిస్తున్నారు. కాని వీటి లో బాధ్యతల, సౌకర్యాల లేమి కుడా ఎక్కువే. ఇంకా ప్రైవేటు స్కూల్ లలో క్రీడల ప్రసక్తే ఉండదు.  మా స్కూల్ లో international teaching methods ఉన్నాయి  అనో, ఇన్ని స్టేట్ లెవెల్  ranks వచ్చాయి అనో, ఒకటవ తరగతి నుంచి  IIT level coaching ఇవ్వబడును అనే ప్రకటనలు తప్ప,  మా స్కూల్ లో ఇలాంటి క్రీడా సౌకర్యాలు ఉన్నాయి, మా స్కూల్ నుంచి ఇంతమంది పిల్లలు క్రీడలలో రాష్ట్రానికి కాని దేశానికి కాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పుకొనే ఒక ప్రైవేటు స్కూల్ ప్రకటన కుడా మనం చూసి  ఉండము.
పిల్లల లో 14-18 సంవత్సరాల వయసు, కాలక్షేపానికి లేదా మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడడం నుంచి, ప్రొఫెషనల్ క్రీడాకారులుగా మారే సమయం. మన దగ్గర ఈ వయసు పిల్లలు కాలక్షేపానికి అయినా ఆటలు ఆడే పరిస్థితి ఉందా? పదవ తరగతి నుంచి మొదలయ్యే పరీక్షల దండయాత్రలు. ఏదో ఒక వృత్తి విద్య కళాశాలలో సీట్ సంపాదించడం తో ఒక అంకం ముగుస్తుంది. ఇంజనీరింగ్/మెడిసిన్ లలో చేరిన వారు ఆ తరువాత campus ఇంటర్వ్యూ ల గురించో లేదా ఫారిన్ చదువుల గురించో ప్రణాళిక లు వేసుకొని దాని కి అవసరమైన కృషి మొదలు పెట్టాలి.  కొంత మంది క్రీడల లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నప్పటికీ , చాల ప్రైవేటు కళాశాలలో ఉండే క్రీడా సదుపాయాల గురించి మనం మళ్ళి ప్రత్యేకం గా చెప్పుకోవాల్సిన పని లేదు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడానికి, నాలుగేళ్ళకు  ఒకసారి, వో రెండు వారాలు వాటి గురించి అలోచించి, బాధపడి తరువాత మరచిపోవడం పరిష్కారం కాదు. ఒలింపిక్స్ కు మధ్య లో ఉన్న నాలుగు సంవత్సరాలు కుడా వాటి గురించి అలోచించి  సాధించడానికి ప్రణాళిక లు రూపొందించుకొని అవసరమైన కృషి చెయ్యాలి. ఆ మాటకు వస్తే, ఒలింపిక్ పతకాలు సాధించడం కంటే ముఖ్యమైనది (ఒలింపిక్ మెడల్ సాధించడం  national pride మరియు sense of achievement గా భావించ బడుతున్నప్పటికి) , ఆరోగ్యానికి చాల అవసరమైన physical activity కి పిల్లలను మొత్తానికి దూరం చెయ్యడం వలన వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించడం . 40-50 సంవత్సరాల వయసు వచ్చే వరకు శారీరిక వ్యాయామానికి దూరం గా ఉండి, రక్తపోటు, మధుమేహం లాంటి జబ్బులో లేదా గుండె జబ్బులో వచ్చాక మార్నింగ్ వాక్ లు మొదలు పెట్టాల్సిన పరిస్థితి నుంచి  మనం బయట పడి, వచ్చే తరాల పిల్లలకు ఆ స్థితి కలగకుండా చెయ్యడం. చాల మంది పిల్లలలో సహజం గా ఏదో ఒక ఆట లో ప్రావీణ్యం లేదా దాని పై ఆసక్తి ఉంటుంది. క్రీడలను ఒక profession గా ఎంచుకొనే అవకాశం ఉన్నప్పుడు, తల్లితండ్రులు పిల్లలలో సహజం గా ఉండే ఆసక్తి ని ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది.  క్రీడలను పిల్లల చదువు లో ఒక భాగం చేసి, తద్వారా ప్రజలందరి జీవితం లో భాగం చెయ్యాలి. అప్పుడు ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం అనేది, దీని Positive side effect  అవుతుంది.
ప్రభుత్వం అన్ని క్రీడ లకు తగిన సౌకర్యాలు కలిగిస్తే  ప్రజల్లో ఆసక్తి వస్తుందా? ప్రజల్లో ఆసక్తి లేనప్పుడు ఎంత మంచి క్రీడా సౌకర్యాలు ఉంటే మాత్రం ఏమి లాభం? అదే ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి బలం గా ఉంటే, మంచి క్రీడా సౌకర్యాల కలిగించేలా  ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. అన్ని ప్రభుత్వమే కలిపించ లేక పోయినా, ప్రైవేటు బాగస్వామ్యం లో అలాంటి సౌకర్యాలు ఏర్పాటు అవుతాయి. (ప్రైవేటు స్కూల్స్ , ఇంజనీరింగ్ కాలేజిల లాగ ). పిల్లి మెడ లో గంట కట్టేది ఎవరన్నట్లు గా, మన దగ్గర ఉన్న పోటి ప్రపంచం లో ప్రజల లో ఆటల పట్ల ఆసక్తి కలిగించి వాటిని జీవితం లో భాగం చెయ్యడం ఎలాగా? తమ పిల్లలు 24 గంటలు, 365  రోజులు చదివినా జీవితం లో అనుకున్నది సాధించలేరు అనే మనస్త్వతం లోపడి కొట్టుకుపోతున్న తల్లి తండ్రులను, ఆటలకు కొంత సమయం కేటాయించేలా చెయ్యడం ఎలాగా?