Monday 21 February 2011

ప్రజాస్వామ్యం లో భావ ప్రకటనా స్వేఛ్చ

జయ ప్రకాష్  నారాయణ గారి మీద జరిగిన బౌతిక దాడి ఒక అప్రజాస్వామిక చర్య.
ఇది ఒక మనిషి కి ఉన్న భావ ప్రకటనా స్వేఛ్చ అనే ప్రాధమిక హక్కు ను ఉల్లంగించే  చర్య. అది కుడా ఆ ప్రాధమిక హక్కులను కాపాడడానికి ఏర్పాటు చేసుకున్న, రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడి ఆ రాజ్యాంగాన్ని  పరిరక్షిస్తాము అని ప్రమాణం చేసిన  ప్రజా ప్రతినిధుల చేత , ఆ రాజ్యాంగ నిలయాలుగా పిలవబడుతున్న ప్రదేశం లో జరగడం ప్రజాస్వామ్యవాదులకు బాధ కలిగించే విషయమే.

      
మన రాజ్యాంగం చేత రక్షించ బడుతున్న  హక్కులలో వాక్ స్వాతంత్ర్యం అనేది ఒక ప్రాధమిక హక్కు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే, ప్రాధమిక హక్కులను రాజ్యాగం కల్పించడం లేదు, వాటిని అది రక్షిస్తుంది. అంటే ప్రాధమిక హక్కులు గా నిర్వచించ బడిన హక్కులు రాజ్యాంగం ద్వారా లేదా చట్టం ద్వార లభించిన హక్కుల కంటే ప్రధానమైనవి. ప్రతి మనిషికి సర్వకాల సర్వావస్తల యందు ఉండే హక్కులు ఇవి.

       
ఇంక జరిగిన సంఘటను చాలా మంది ఖడించారు మంచి పరిణామమే. కాని మన భావజాలంకి అనుకూలం గా ఉన్న వ్యక్తుల మీద జరిగిన దాడిని మాత్రమే ఖండించడం అనే పద్ధతి  అనుసరణీయం కాదు. నేను చెప్పేది ఏమిటంటే ఇలాంటి సంఘటనలను ఒక భావజాలం లేదా కారణం కోసం పోరాడుతున్న వారు, ఆ భావజాలానికి బిన్నమైన వారి మీద  లేదా వ్యతిరేకిస్తున్న వారి మీద, చేసిన దాడి గా మనం చూడకూడదు. అంటే దాడి చేసిన వారి ఉద్దేశ్యం ఇదులో కలిపి చూడకూడదు. ఉద్దేశ్యాలను ఈ సంఘటన నుంచి వేరు చేసి మనం దీనిని ఖండించాలి. దీనికి పౌరుల భావప్రకటనా స్వేఛ్చ మీద దాడి గా ఖండించాలి.  ఇలాంటి సంఘటనలు  ఒక వ్యక్తి స్వేచ్చగా  తన భావాలను  వెల్లడించ లేని పరిస్థితి కలిపిస్తాయి, భయపడే పరిస్థితి కలిపిస్తాయి. బావ ప్రకటనకు భయపడవలసిన స్థితి ప్రజాస్వామ్య  మనుగడకు మంచిది కాదు.

       
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు మౌనం గా ఉండడంభయం తోనో గాని, అవసరం కోసం గాని, అవకాశం కోసం గాని, ప్రజాస్వామ్యానికి  చేటు చేస్తుంది. మనం ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించక పోవడం వీటిని ఆమోదిస్తున్నాం  అనే భావన కలిగిస్తుంది. ఇది మరింత ప్రమాదం. తమ అభిప్రాయాలను లేదా సిద్దాంతాలకు ప్రచారం  కల్పించుకోవాలి అనుకొనే వాళ్ళుతమ ఉద్దేశ్యాలను అవి వ్యక్తిగతం ఐనవి కాకపోయినా, నేరవేర్చుకోవాలి అనుకొనే వాళ్ళు దీనిని ఒక సాధనం గా మార్చుకొనే అవకాశం ఉంది.
రాజ్యాంగ పద్దతుల మీద నమ్మకం లేకపోవడం, తోటివారి హక్కులను గౌరవించక పోవడం అనే పోకడలు ఈ రోజు వచ్చినవి కాదు. వీటిని కొంత కాలం నుంచి అందరమూ చూస్తున్నాము. ఇంతకుముందు జరిగిన వాటిగురించి చదివి ఉన్నాము. నిన్నటి సంఘటనకు కారణం ఐన వారు మాత్రమే దీనికి ఆద్యులు కాదు పూర్తిగా బాద్యులు కాదు. వీరు ఒంటరిగా కుడా లేరు. రాజ్యాంగ వ్యవస్థలను వ్యక్తిగత అవసరాల కోసం, అధికారం కోసం ధ్వంసం చెయ్యడం, అలా జరిగినప్పుడు ప్రజలు స్పందించకుండా మౌనంగా ఉండడం అనే వాటి ఫలితం. ఇది ఒక విధంగా మన పౌర వ్యవస్థ సమైక్య వైపల్యం. 
ప్రజాస్వామిక స్పందన ఎలా ఉంది ఉండవలసింది అని ఒక ఆలోచన చేస్తే,  తెలంగాణా రాష్ట్ర సమితి ప్రజా పతినిధులు చెప్పినట్లు గవర్నర్ ప్రసంగం లో తెలంగాణా కోసం దాదాపు గా వెయ్యిమంది ఆత్మహత్య చేసుకొన్న విషయము గాని, ఇంకా తెలంగాణా ఆకాంక్ష గురించి గాని ఒక్క మాతకుడా మాట్లాడలేదు అనేది ప్రధాన విమర్శ. జయ ప్రకాష్ గారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడినప్పుడు సభలో జరిగిన రాజ్యంగా ఉల్లంఘనను ప్రశ్నించి గవర్నర్ గాని ప్రసంగం లో జరిగిన అన్యాయాన్ని ప్రశించాకుండా ద్వంద నీతి ని ప్రదర్శించారు అనేది ఇంకొక విమర్శ. తెలంగాణా రాష్ర సమితి ప్రజా ప్రతినిధులకు  ప్రజాస్వామ్య పద్దతుల మీద నమ్మకం ఉండినట్లైతే ఇదే విషయం ఒక ప్రెస్ మీట్ లోనో  లేక  అదే  మీడియా పాయింట్ దగ్గరో చెప్పి ఉండవలసింది.ఈ రోజు కు కుడా సామాన్య ప్రజల గొంతు వినిపించడానికి తగినన్ని అవకాశాలు లేక పాయినప్పటికి రాజకీయ నాయకులకు ఆ విదమైన ఇబ్బంది లేదు. వారు చెప్పే ప్రతి మాట చేసే ప్రతి విమర్శ ఈ రోజు అందరికి చేరుతున్నది.