Thursday 24 May 2012

నిజాల గోడలు- రంగు కళ్ళద్దాలు

రెండు కథలు, ఈ కథలలో ఒకటి చాలా రొజుల కిందట చదివినది అంటే సుమారుగా ౩ యేండ్ల కిందట ఇంకోటి కొంచెం తరువాత అంటే పోయినేడు చదివినది.

నిజాల గోడ ,  చాలామంది లాగా నే నాకు కూడా  ప్రఖ్యాత సినిమా దర్శకుడు గా తెలిసిన ,  సింగీతం శ్రీనివాసరావు గారు రాసినది. సుమారు గా 7 -8  యేండ్ల కిందట వచ్చిన కథ అనుకుంటా. సింగీతం శ్రీనివాస రావు గారి క రాజు కథలు అనే పుస్తకం లోనిది.  ఈ కథలు ఆన్నింటి లోను  క రాజు అనే రాజు గారు ప్రధాన పాత్ర. అందరి రాజులకు ఉన్నట్లే మంత్రులు సేనాధిపతులు క రాజు గారికి ఉంటారు. వారందరూ ఒక్కో కథ లో వస్తూ ఉంటారు

మంచి కళ్ళజోళ్ళు కొనుక్కోండి,  సి ఎస్ రావు గారు రాసినది. సి ఎస్  రావు కథలు అనే పుస్తకం లోనిది . ఈయన  ప్రాణం ఖరీదు  సినిమా కు మాటలు రాశారు. ఇది 35 యేండ్ల కంటే  ముందు వచ్చిన కథ. (ప్రధమ ముద్రణ ఆధారం గా)



నిజాల  గోడ 


క రాజు గారు మంత్రి తో కలిసి మారు వేషం లో దేశం లో పర్యటిస్తూ ప్రజల మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు  పగలే సన్యాసుల వేషం లో  ఒకానొక ఉరికి వెళ్ళడం  జరుగుతుంది. ఆ ఉరిలో ఒకే విధంగా ఉండే మూడు పెద్ద భవనాలు,  వాటి పక్కన  ఉన్న స్థలం లో పెద్ద గోడ మాత్రం  ఉండి, ఆ గోడ పక్కన విచారం గా కుర్చుని ఉన్న వ్యక్తి ని కలుసుకుంటారు. ఆ వ్యక్తి మాటల ద్వార ఆ మేడలు వాళ్ళ అన్నలకు  నాన్న గారు కట్టించినవి అని, ఇతని వాటా ఇంటి  కింద  ముందు ఆ  గోడ కట్టి  మొదలు పెట్టగానే అతని తండ్రి గారు జబ్బు పడడం అప్పుడు  ధనం మొత్తం పోవడం జరిగి ఆయన  చనిపోయాడు అని, ఇతని వాటా కింద ఆ గోడ మాత్రం మిగిలింది అని తెలుస్తుంది. 


అతని కష్టాలను విని క రాజు గారు ఆ గోడ నే ఉపాధి సాధనం గా చేసుకొనే ఉపాయం గా  ఆ గోడ మీద ఆరు నెలల వరకు నిజాలనే  రాయమని,  ఆ చుట్టూ పక్కల జరిగే విషయాలు మరియు జనాలు తెలుసుకోవాలనే విషయాలు  రాయమని చెప్తారు. 

క  రాజు గారి సలహా ప్రకారం గా గోడ  మీద  చుట్టూ పక్కల  జరిగే విషయాలను  మరియు జనాలకు అవసరమైన  సంగతులు (కురగాయాల ధరలు, రాహుకాలం మరియు వర్జ్యం మొదలైనవి) రాస్తూ ఉండగా ఆ  గోడ  చాల  ప్రచారం పొంది,  ప్రఖ్యాతి చెందడమే కాకుండా ఆ గోడ  మీద  రాసినవి  అన్ని నిజాలే అని జనాలు  నమ్మడం తో అ  గోడ  కు నిజాల  గోడ  అని పేరు  స్థిరపడుతుంది. తరువాత మెల్లగా కొంత మంది వ్యక్తులకు మేలు చేసే నిజాలు అంటే  ఫలానా ఆయన చేత  ఇక్కడ హరికథా కాలక్షేపం , ఫలానా ఆయనకు వచ్చిన బిరుదుల సంగతి లాంటివి రాయడం మొదలు పెడతాడు. అలా మొదటి సారిగా గోడ వలన సంపాదన వస్తుంది.  తరువాత  ఇలాంటి వాటికి గోడ మీద ప్రచారం కలిగించి సంపాదన పెంచుకుంటాడు. ఈ లోపల ఆరు నెలల సమయం గడుస్తుంది.

మెల్ల మెల్లగా పూర్తిగా నిజాలు కాకుండా కొంతమంది కి వ్యాపార ప్రయోజనం కలిగించే విషయాలు గోడ  మీద  రాయడం  మొదలు పెడతాడు . అప్పటికే  జనాలకు గోడ మీద మంచి గురి ఏర్పడి ఉండడం  వలన , మరియు చాల మంది ఉరి జనాలకు పొద్దున్నే లేచి గోడ మీద  రాసినది  చదవనిదే మరే పని మొదలు పెట్టకపోవడం అలవాటు అయినందున నిజాల గోడ సంపాదన ఇబ్బడిముబ్బడి గా పెరిగి చాలా ధనవంతుడు అవుతాడు. అప్పుడు తనను ఇన్ని రోజులు తక్కువగా చుసిన అన్నల మీద అబద్దాలు గోడ మీది రాసి వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టి  వారి ఇళ్ళను కుడా ఇతనే కొనేస్తాడు. 

మెల్లగా నిజాల గోడ యజమాని అరాచకాలు క రాజు గారికి తెలుస్తాయి.  రాజు గారికి  కాకుండా వేరే వాళ్లకు ప్రజల మీద ఇంత అధికారం ఉండడం ఇష్టం లేకనో, లేదా నిజంగా చెడు ను అదుపు చెయ్యాలనే ఉద్దేశ్యం తోనో క రాజు గారు మంత్రి ని పిలిచి నిజాల గోడ యజమాని  ని అదుపు చేసే ఉపాయం చెప్తారు. క రాజు గారి ఆదేశానుసారం  మంత్రి గారు నిజాల గోడ కు ఎదురుగా మరి కొన్ని గోడలు కట్టించి  ఆ గోడల మీద కుడా అబద్దాలు నిజాలు కలిపి రాయించే ఏర్పాటు  చేయిస్తాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు  జనాలు ఏ గోడ మీదది నిజమో ఏ గోడ మీదిది అబద్దమో తెలియని తికమకు లోనవడం తో  నిజాల గోడ ప్రభావం  తగ్గిపోతుంది 

మంచి కళ్ళజోళ్ళు కొనుక్కోండి
ఒక యేరు, యేరు మీద వంతెన . పట్నం నుంచి ఆ వంతెన మీద యేరు దాటి వెళ్తే అవతల ఒక ఊరు. ఆ ఊరి లో బాగా పలుకుబడి ఉన్న భూస్వామి  సుందర్రామయ్య.  ఆ ఉరికి బస్సు సౌకర్యం  లేని సమయం లో బాగా విలాసంగా బతికి   ఇప్పుడు  ఇబ్బందుల్లో ఉన్న ఒక  జట్కా బండి సాయిబు గారు. బక్కచిక్కిన సాయిబు గారి గుఱ్రం.
ఊరి లో పంచాయతి ఎన్నికల సమయం వచ్చింది. ముందు తరం నుంచి పెత్తనం, అధికారం సంక్రమించిన  సుందర్రామయ్య  గారు ఎన్నికల్లో పోటిచేస్తున్నారు. ఇప్పటి దాక ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చి పోయినా ఆయనే పంచాయతి  ప్రెసిడెంట్. గత  మూడు దఫాల  నుంచి మాత్రం కనకరాజు  ఆయన  మీద  పోటి చేస్తున్నాడు. కనకరాజుకు మంచి వక్తగా పేరుంది. కనకరాజు సభ  పెడితే బాగా మాట్లాడుతాడు వెళ్లి విందాము అని జనాలు వచ్చేవాళ్ళు.

ఈ సారి ఎన్నికల్లో కుడా ఊరి మధ్య  లో కనకరాజు సభ పెట్టాడు. జనం బాగా వచారు. కనకరాజు ఉపన్యాసం మొదలు పెట్టబోతుండగా చాలా వాహనాలతో, బ్యాండ్ మేళం తో, చాలా మంది జనాలు అనుసరిస్తుండగా, సుందర్రామయ్య కారు లో కూర్చొని ఉరేగింపుగా అటు వైపే వచ్చాడు. కనకరాజు సభకు వచ్చిన జనం అంతా ఆ ఎన్నికల ఊరేగింపు వైపు తిరిగిపోయారు. ఆ ఊరేగింపు వైపు చూస్తూ ఉండి పోయారు కనకరాజు పిలుస్తున్నా కుడా వినకుండా. కనకరాజు, మైకు మిగిలిపోయారు సభలో. ఊరేగింపు మహా వైభవం గా వచ్చింది దుమ్ము రేపి వెళ్ళిపోయింది.
 ఊరేగింపు వెళ్ళిపోయిన  కొంతసేపటి వరకు జనం దాని గొప్పదనం గురించి మాట్లాడుకొని, తిరిగి కనకరాజు సభ దగ్గరకు వచ్చారుఅప్పుడు కనకరాజు వాళ్ళతో, అయ్యా  మీరు అంత గొప్ప ఊరేగింపు చూసిన తరువాత ఇంక నేను ఏమి చెప్పినా  నాకు వోటు వెయ్యరు అని తెలుసు, కాక పోతే నేను ఎన్నికలలో నిలబడ్డాను కాబట్టి మాట్లాడుతాను. ఆ మాట్లాడేది  సుందర్రామయ్య గురించి కాకుండా  ఒక చిన్న కథ చెప్తాను వచ్చే ఎన్నికల నాటికి అయినా దీని అర్థం తెలుసుకొని వోటు వెయ్యండి అని ఇలా చెప్పాడు 

మన ఊరికి  బస్సు సౌకర్యం లేని సమయం లో సాయిబు గారి జట్కా బండి కి చాలా గిరాకి ఉండేది. సాయిబు గారు  రోజూ బాగా డబ్బులు సంపాదించి, తను తిని తాగి విలాసంగా ఉండడమే కాకుండా గుఱ్ఱానికి కి కుడా మంచి దాణా, పచ్చి గడ్డి తినిపించే వాడు. ఎప్పుడైతే జనం బస్సులకు అలవాటు పడి, బస్సు  లకు  లాభాలు రావడం మొదలై, బస్సులు ఎక్కువ అయ్యాయో అప్పటినుంచి  జట్కా బండి కి బేరాలు తగ్గిపోయాయి. దాంతో పాటే  సాయిబు గారి ఆదాయం తగ్గిపోయింది, విలాసాల మాట అటుంచి బతుకు గడవడమే కష్టం అయ్యింది. ఇంక గుఱ్ఱానికి పచ్చి గడ్డి ఎక్కడినుంచి తెస్తాడు? అందుకే ఎండుగడ్డి వెయ్యడం మొదలు పెట్టాడు. పచ్చి గడ్డి తిని అలవాటు పడిన  గుఱ్ఱం ఎండు గడ్డి తినడం మానేసింది. ఇలా అయితే  గుఱ్ఱం చనిపోయి తనకు ఈ   మాత్రం బతుకు తెరువు కుడా లేకుండా పోతుంది అని బాగా అలోచించి పక్క ఊరి  తిరుణాల  లో  ఆకు పచ్చ కళ్ళజోడు తెచ్చి  గుఱ్ఱానికి తగిలించాడు. దాంతో గుఱ్ఱానికి ఎండుగడ్డి కుడా పచ్చిగడ్డి లాగా కనిపించి గడ్డి తినడం మొదలు పెట్టింది.  

ఈ  కథ  చెప్పి ఆపి కొంచెం మంచి నీళ్ళు తాగి కనకరాజు ఇలా చెప్పి సభ  ముగించాడు. "ఇప్పుడు మీ ముందు నుంచి వెళ్లిన బ్రహండమైన ఊరేగింపు ఆ  ఆకుపచ్చ కళ్ళజోడు లాంటిది. ఆ కళ్ళజోడు కళ్ళకు తగిలించుకొని మోసపోకండి. దయచేసి నిజాన్ని చూడడానికి మంచి కళ్ళ జోడు కొనుక్కోండి."

సభ  లో కనకరాజు ఏమి చెప్పాడు రా  అని అడిగాడు సభకు వెళ్లి వచ్చిన పక్కవాడిని ఒక పెద్ద మనిషి. అందరిని మంచి కళ్ళజోడు కొనుక్కోమన్నాడు అని చెప్పాడు పక్కవాడు. 

అది రెండు కథల  సంగతి.........

ముగింపు .

ఇంక జనం సంగతి ఏమిటి? సమాచారం తెలుసు కోవడానికి ఒకటి కంటే ఎక్కువ గోడ లు ఉన్నందుకు సంతోషించారా?  ఈ గోడ నుంచి ఆ గోడ కు అక్కడినుంచి మరో గోడకు పరిగెత్తినా అసలు నిజం ఏమిటో తెలియనందుకు విచారపడ్డరా? అప్పుడు ఎవరు అడగలేదు వాళ్ళను. మరి  ఇప్పుడు ???

వచ్చే ఎన్నికలకు జనం ఆకు పచ్చ  కళ్ళజోళ్ళు  తీసేసేసారా?  అప్పటినుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కళ్ళజోళ్ళు మరిన్ని రంగుల లో దొరకడం మొదలైందా?   అంతా ఒకే రంగు కళ్ళజోడు పెట్టుకోకుండా తలా ఒక రంగు వి పెట్టుకొని చూడడం మొదలు పెట్టారా?   అసలు రంగు ఎప్పటికైనా బయటపడేనా? .....పడకపోతుందా?