Monday 6 August 2012

ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం మనకు అంత ముఖ్యమైన విషయమా?

కిందటి వారం, ఒలింపిక్స్ లో  చైనా వాళ్ళు చాల పతకాలు సాధించడం ఇలా సాధ్యం అయ్యింది అని, కొంతమంది చిన్న పిల్లలను చాల హింసాత్మకంగా వ్యాయామం చేయిస్తున్న ఫోటో లను ఇమెయిల్ లో  పంపిచారు. దాదాపు అదే సమయం లోనే, అదే ఫోటో లు ఉండి ఇలాంటి పతకాలు అవసరమా? అనే అర్థం వచ్చేలా రాసిన ఒక బ్లాగ్ కుడా చదివాను. ఫోటో లు ఇంతకు ముందు చూసిన వాటిలాగ ఉన్నాయే అనుకొని ఆలోచిస్తే, నాలుగు సంవత్సరాల కిందట బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు (అయిపోయిన తరువాత నో),  మన వాళ్లు ఎందుకు పతకాలు సాధించలేక పోతున్నారు అని రాస్తూ, ఇవే ఫోటో లు ఉన్న ఈమెయిలు చదివినట్లు జ్ఞాపకం వచ్చింది.
ప్రతి నాలుగు సంవత్సరాల లకు ఒకసారి ఒలింపిక్స్ జరగడం, అవి మొదలై మిగతా దేశాల క్రీడాకారులు పతకాలు సాధించడం, ఎవరెవరు ఎన్ని గెలిచారో మనం టీవీ లలో చూడడం లేదా వాటి గురించి పత్రికలలో చదవడం జరుగుతోంది. అ వెంటనే చైనా తోనో లేదా బాగా తక్కువ జనాభా ఉన్న ఏదో ఒక యూరోపియన్ దేశం తోనో పోలికలతో, ఎందుకు భారతదేశ క్రీడాకారులు పతకాలు గెలవడం లేదు అనే ఆవేదన తో కూడిన విశ్లేషణలు మరియు విమర్శలు  మొదలవుతాయి. ఒలింపిక్స్ అయిపోయిన తరువాత రోజు నుండి నాలుగు సంవత్సరాలు గడిచి మరల ఒలింపిక్స్ వచ్చే వరకు పతకాల గురించి చర్చలు కనిపించవు. ఆలోచనలు రావు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం మనకు అంత ముఖ్యమైన విషయమా? అసలు మనం ఏదయినా అనుకుంటే సాధించకుండా వదులుతామా? ఇదేదో అందని ద్రాక్ష పళ్ళ వ్యవహారం లా ఉందే అనుకోవాల్సిన పని లేదు. IIT/IIM  లేదా MIT/ Harvard/Oxford యూనివర్సిటీ ల లోనో  సీట్ సాధించడం లేదా ఒలింపిక్స్ లో పతకం సాధించడం, వీటి మధ్య చాల తేడానే ఉండి విబిన్నమైన కృషి అవసరం అయినప్పటికీ ,  ఇవి సాధించడానికి అవసరమైన స్పూర్తి (Motivation కు సమాన పదం అనుకుంటున్నాను), పట్టుదల ఇంకా నిరంతర కృషి అనే విషయాలలో లో  చాల సామరస్యాలు కుడా ఉన్నాయి.
దేశం లోని చాల సమస్యల లాగానే పతకాల సమస్య కు కుడా అవినీతి యే- క్రీడా సంస్థల లో మరియు వాటిని నియంత్రించే రాజకీయ నాయకులలో- కారణం అని చాల మంది నమ్మకం. వైఫల్యానికి వీటి  పాత్ర కుడా కొంత వరకు ఉన్నప్పటికీ ఇవి మాత్రమే కారణం కాదు. మన దేశం లో, మంచి కాలేజీ లో సీట్ సంపాదించి ఆ తరువాత విదేశాలలో చదవాలి అనో, స్వదేశం లోనో విదేశాల లోనో  సాఫ్ట్ వేర్ ఉద్యోగం చెయ్యాలనే కోరిక నే ఎక్కువ మందికి -విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు-  ఉంది కాబట్టే ఆ దిశలో మన ప్రయత్నాలు ఉన్నాయి. వట్టి ప్రయత్నాలు మాత్రమే కాకుండా మంచి ఫలితాలు కుడా సాధిస్తున్నాము.  ప్రభుత్వ వైఫల్యాలు లేదా వ్యవస్థ లో ఉన్న అవినీతి వీటిని అంతగా ప్రభావితం చేయలేకున్నాయి. (అందరికి కోరిన చదువు చదువుకొనే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కనీస వసతులు కుడా అందుకోలేని పేదవారు చాలామంది ఉన్నారు మన దేశం లో. ఇది చదువు ను భరించగలిగే స్థోమత ఉన్న వారి గురించే).
ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచో ఊడి పడరు కదా? ఆటలలో ఆసక్తి ఉన్న పిల్లలు వాటిని నిరంతరం సాధన చేసి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు గా రూపొందుతారు . ప్రభుత్వ  పాఠశాల లలో ఇంకా కొంత వరకు క్రీడలకు సమయం కేటాయిస్తున్నారు. కాని వీటి లో బాధ్యతల, సౌకర్యాల లేమి కుడా ఎక్కువే. ఇంకా ప్రైవేటు స్కూల్ లలో క్రీడల ప్రసక్తే ఉండదు.  మా స్కూల్ లో international teaching methods ఉన్నాయి  అనో, ఇన్ని స్టేట్ లెవెల్  ranks వచ్చాయి అనో, ఒకటవ తరగతి నుంచి  IIT level coaching ఇవ్వబడును అనే ప్రకటనలు తప్ప,  మా స్కూల్ లో ఇలాంటి క్రీడా సౌకర్యాలు ఉన్నాయి, మా స్కూల్ నుంచి ఇంతమంది పిల్లలు క్రీడలలో రాష్ట్రానికి కాని దేశానికి కాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పుకొనే ఒక ప్రైవేటు స్కూల్ ప్రకటన కుడా మనం చూసి  ఉండము.
పిల్లల లో 14-18 సంవత్సరాల వయసు, కాలక్షేపానికి లేదా మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడడం నుంచి, ప్రొఫెషనల్ క్రీడాకారులుగా మారే సమయం. మన దగ్గర ఈ వయసు పిల్లలు కాలక్షేపానికి అయినా ఆటలు ఆడే పరిస్థితి ఉందా? పదవ తరగతి నుంచి మొదలయ్యే పరీక్షల దండయాత్రలు. ఏదో ఒక వృత్తి విద్య కళాశాలలో సీట్ సంపాదించడం తో ఒక అంకం ముగుస్తుంది. ఇంజనీరింగ్/మెడిసిన్ లలో చేరిన వారు ఆ తరువాత campus ఇంటర్వ్యూ ల గురించో లేదా ఫారిన్ చదువుల గురించో ప్రణాళిక లు వేసుకొని దాని కి అవసరమైన కృషి మొదలు పెట్టాలి.  కొంత మంది క్రీడల లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నప్పటికీ , చాల ప్రైవేటు కళాశాలలో ఉండే క్రీడా సదుపాయాల గురించి మనం మళ్ళి ప్రత్యేకం గా చెప్పుకోవాల్సిన పని లేదు.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడానికి, నాలుగేళ్ళకు  ఒకసారి, వో రెండు వారాలు వాటి గురించి అలోచించి, బాధపడి తరువాత మరచిపోవడం పరిష్కారం కాదు. ఒలింపిక్స్ కు మధ్య లో ఉన్న నాలుగు సంవత్సరాలు కుడా వాటి గురించి అలోచించి  సాధించడానికి ప్రణాళిక లు రూపొందించుకొని అవసరమైన కృషి చెయ్యాలి. ఆ మాటకు వస్తే, ఒలింపిక్ పతకాలు సాధించడం కంటే ముఖ్యమైనది (ఒలింపిక్ మెడల్ సాధించడం  national pride మరియు sense of achievement గా భావించ బడుతున్నప్పటికి) , ఆరోగ్యానికి చాల అవసరమైన physical activity కి పిల్లలను మొత్తానికి దూరం చెయ్యడం వలన వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించడం . 40-50 సంవత్సరాల వయసు వచ్చే వరకు శారీరిక వ్యాయామానికి దూరం గా ఉండి, రక్తపోటు, మధుమేహం లాంటి జబ్బులో లేదా గుండె జబ్బులో వచ్చాక మార్నింగ్ వాక్ లు మొదలు పెట్టాల్సిన పరిస్థితి నుంచి  మనం బయట పడి, వచ్చే తరాల పిల్లలకు ఆ స్థితి కలగకుండా చెయ్యడం. చాల మంది పిల్లలలో సహజం గా ఏదో ఒక ఆట లో ప్రావీణ్యం లేదా దాని పై ఆసక్తి ఉంటుంది. క్రీడలను ఒక profession గా ఎంచుకొనే అవకాశం ఉన్నప్పుడు, తల్లితండ్రులు పిల్లలలో సహజం గా ఉండే ఆసక్తి ని ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది.  క్రీడలను పిల్లల చదువు లో ఒక భాగం చేసి, తద్వారా ప్రజలందరి జీవితం లో భాగం చెయ్యాలి. అప్పుడు ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం అనేది, దీని Positive side effect  అవుతుంది.
ప్రభుత్వం అన్ని క్రీడ లకు తగిన సౌకర్యాలు కలిగిస్తే  ప్రజల్లో ఆసక్తి వస్తుందా? ప్రజల్లో ఆసక్తి లేనప్పుడు ఎంత మంచి క్రీడా సౌకర్యాలు ఉంటే మాత్రం ఏమి లాభం? అదే ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి బలం గా ఉంటే, మంచి క్రీడా సౌకర్యాల కలిగించేలా  ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. అన్ని ప్రభుత్వమే కలిపించ లేక పోయినా, ప్రైవేటు బాగస్వామ్యం లో అలాంటి సౌకర్యాలు ఏర్పాటు అవుతాయి. (ప్రైవేటు స్కూల్స్ , ఇంజనీరింగ్ కాలేజిల లాగ ). పిల్లి మెడ లో గంట కట్టేది ఎవరన్నట్లు గా, మన దగ్గర ఉన్న పోటి ప్రపంచం లో ప్రజల లో ఆటల పట్ల ఆసక్తి కలిగించి వాటిని జీవితం లో భాగం చెయ్యడం ఎలాగా? తమ పిల్లలు 24 గంటలు, 365  రోజులు చదివినా జీవితం లో అనుకున్నది సాధించలేరు అనే మనస్త్వతం లోపడి కొట్టుకుపోతున్న తల్లి తండ్రులను, ఆటలకు కొంత సమయం కేటాయించేలా చెయ్యడం ఎలాగా? 

1 comment:

  1. చాలా బాగుంది చందు, నిజంగా తమ పిల్లలను బాగా చదివించాలని ఇంటికి దూరంగా residential హాస్టల్ లో (కోళ్ళ పారం కోళ్ళ లాగా ) పెట్టి, 365 రోజులు చదువు జైలు జీవితం వాళ్ళకు అలవాటు చేస్తే ఇంకా గేమ్స్ గురించిన ఆలోచన వాళ్ళకు ఎక్కడిది. parents మైండ్ సెట్ మారితే నే ఈ సమస్యకు పరిష్కారం.

    సునీల్ కుమార్

    ReplyDelete